బెంగాల్‌లో ఓటమి ఎఫెక్ట్.. కాంగ్రెస్‌లో టీఎంసీ విలీనం?

  • సోనియాతో మమత భేటీ తర్వాత రాహుల్‌తో అభిషేక్ సమావేశం
  • విలీనంపై ఊపందుకున్న ఊహాగానాలు
  • బెంగాల్ ఎన్నికల్లో ఓటమితో టీఎంసీలో తీవ్ర సంక్షోభం
  • విలీనం వార్తలను ఖండించిన తృణమూల్ కాంగ్రెస్ వర్గాలు
జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీతో భేటీ అయిన మరుసటి రోజే, టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. బుధవారం ఢిల్లీలోని 10 జన్‍పథ్‌లో దాదాపు 90 నిమిషాల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ భేటీ, కాంగ్రెస్‌లో తృణమూల్ విలీనం కానుందనే ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది.

ఇటీవల జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో బీజేపీ 208 స్థానాలతో అధికారాన్ని దక్కించుకోగా, టీఎంసీ కేవలం 80 సీట్లకే పరిమితమైంది. ఈ ఓటమి అనంతరం పార్టీలో తీవ్ర అసమ్మతి చోటుచేసుకుంది. పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీని వీడుతుండటంతో టీఎంసీ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అగ్రనాయకత్వంతో టీఎంసీ నేతల వరుస భేటీలు రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం, ఈ సమావేశాల్లో ప్రధానంగా బెంగాల్‌లోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, 'ఇండియా' కూటమిని పటిష్టం చేసే వ్యూహాలపై చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. కూటమిలో రాహుల్ గాంధీ నాయకత్వాన్ని అంగీకరించేందుకు టీఎంసీ సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే, విలీన ప్రతిపాదన తృణమూల్ కాంగ్రెస్ నుంచే రావాలని, తమ వైపు నుంచి ఎలాంటి ఒత్తిడి లేదని కాంగ్రెస్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

మరోవైపు, విలీనం వార్తలను తృణమూల్ కాంగ్రెస్ వర్గాలు తీవ్రంగా ఖండించాయి. ఇవన్నీ కేవలం నిరాధారమైన పుకార్లేనని కొట్టిపారేశాయి. రాహుల్-అభిషేక్ భేటీలో విలీనం ప్రస్తావనే రాలేదని, కేవలం బెంగాల్ రాజకీయాలు, కూటమి భవిష్యత్తు వ్యూహాలపైనే చర్చించారని పలు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. కాగా, మమతా బెనర్జీ గతంలో కాంగ్రెస్‌తో విభేదించి 1998లో తృణమూల్ కాంగ్రెస్‌ను స్థాపించిన విషయం తెలిసిందే.

Trinamool Congress
Mamata Banerjee
Rahul Gandhi
West Bengal Politics
Congress TMC Merger
India Alliance

More Telugu News